Tuesday, 31 March 2020

భావం - భాష

భావాలు  విచిత్రమైనవి  .

మన సొంత భావాలు , ఎవరివోలా  కనిపిస్తాయి .                                                                          ఎవరో చెప్పినవి మనసొంతంలా   కనిపిస్తాయి . 


నిజంగా  కొత్తభావాలంటూ  లేవు .                                                                                                    ఆకలి , నిద్ర , దాహం, ఆకర్షణ, అసంతృప్తి , జీవితంపై మమకారం --- అందరికీ ఇవి సమానమే .  కొత్తవి ఎట్లా  వస్తాయి ?  


భావాలు మానవులందరినీ ఏకం చేస్తాయి .                                                                                      వాటిని   చెప్పడంలో  ప్రయోగించే  వివిధ భాషలు , మానవుల్ని విడదీస్తాయి . 


ప్రాణంపై తీపి తీసుకోండి ,  చావడానికి ఎవరూ ఇష్టపడరు . చచ్చిపోయింతర్వాత  కూడా  బ్రతకాలాన్నంత  తీపి....  దానికోసం , మరో లోకం, స్వర్గం ,  స్వర్గానికి అధిపతి ,  ఆత్మ అక్కడికి చక్కాపోయి , శాశ్వతంగా ఉండడమో ,  లేకపోతే  మళ్ళా  కొన్ని జన్మములు  ఎత్తి  ---- మానవ జన్మమే ఎత్తాలి.   మళ్లా  ---  ఆత్మని శుద్ధం చేసుకొని,  మళ్ళా   పైకి పోయి  పరమాత్మలో  ఐక్యం  కావడం , ఇన్నిటిని  కల్పించుకుంది  జీవితంపై మమకారం .  అంతే  కాదు .  ఈ జీవితం అంతా  అసత్యం , శరీరం మాయ, బ్రతుకు కల , పరమాత్మలో  జీవాత్మ   ఐక్యం  కావడం  సత్యం , అని నమ్మమని చంపుకుతింటుంది  ఈ మమకారం ..  


 ఈ మతాలూ , ఈ  దేవుళ్ళు , ఈ  ఆదర్శాలు , భాష  కల్పించినవే  కదా  పాపం .                  ఈ భావాలే  యదార్థాలని  నమ్మి తృప్తి పడతారు అమాయకపు మానవులు. 


అనంతం నుంచి ప్రళయంలో ఉద్భవించి  మూగదైపోయిన  ప్రపంచం రొద ఈ కంఠధ్వని --  ఆకలి , ఆలోచన ---

                                                                                                                                     NRB  

Monday, 30 March 2020

సంఘం - 1

హృదయం ఉన్నవాళ్లను సంఘం దూషిస్తుంది . 

సంఘం కోరేది ,  మానవుడి ఆనందం , క్షేమం కావు . అది కోరేది నమ్రతా , విలువలు . 


మనకి లేని అనుభవం , ఆనందం  ఇతరులకెందుకు ?  అనుకొని  సంఘం వాటి వినాశనానికి దారితీసే  ద్వారబంధాలని నిర్మాణం చేస్తుంది .

 పాపం  సంఘాన్ని దూషించడం  ఎందుకూ ? సంఘం ఏం చేసింది  ? 


కాస్తా -- నా సుఖాన్ని  ఆనందాన్ని , వీటిని గురించి          ఆలోచించడం మానుకొని , కొంచెం  వీటిని   త్యాగం  చేస్తివా , ఇతరులు  కూడా  హాయిగా ఉంటారు  ---  కాబట్టి ,            నే పెట్టిన నియమాలని  అతిక్రమించకుండా  జాగ్రత్తగా నడుచుకోమంటుంది  సంఘం . 


" నీ ఇష్టం ,     నీతి అనుకో , సంప్రదాయమనుకో , నీకు సంఘం లో ఉన్నంతవరకూ  వీటితో  నిమిత్తం తప్పదు పిచ్చివాడా " అంటుంది . 


                                                                                                                                               NRB

ఆలోచనలు

నడుస్తుంటే  ఏవేవో ఆలోచన్లోస్తుంటాయి .                                                          స్థిమితంగా కూర్చొని ఆలోచించడం  చేతకాదు .


ఆలోచన సాగిస్తుంటే ఏదో బరువు తగ్గినట్టుగా వుంటుంది .                                                    కానీ ప్రస్తుతపు విషయాలను గురించి ఆలోచించలేక పోతున్నాము!


ప్రస్తుతం అంటే యథార్థం , ఇప్పుడే ఏదో నిర్ణయించుకోవాలి .  కర్తవ్యానికి దిగాలి .      దీనికి ధైర్యం లేదు . భయంకరమైన యదార్థం . ఇతరుల సలహా పనిచెయ్యదు .        దీనికి సమాధానం పుస్తకాలివ్వలేవు .


చరిత్ర తనని తానే అనుకరిస్తుందన్నది సత్యం కాదు. ఒక సమయంలో ఒక చోట ఏర్పడ్డ  పరిస్థితులు , ఎప్పుడూ , ఎక్కడా , మళ్లా ఏర్పడవు . ప్రతి సంభవం అపూర్వమైనది , దానికదే సాటి .  అల్లాంటప్పుడు చరిత్రలో మానవ సంఘాన్ని హృదయం యొక్క పరిణామాన్ని  కొలుచుకొని, అందులోంచి  భవిష్యత్తుకి  వుపయుక్తమయ్యే సిద్ధాంతాలను, ప్రతిపాదించటం గొప్ప పొరబాటు .


ప్రాకృతిక సిద్ధాంతాలను అనుకరించవచ్చు . అవి తప్పవు.  వాటిని ఎవ్వరూ అతిక్రమించలేరు


సూర్యుడు ప్రతి నిత్యమూ తూర్పున ఉదయిస్తాడని అనుకోని ప్రవర్తించటంలో హాస్యాస్పదమేమి  లేదు .  కాని  సిపాయిల తిరుగుబాటు, విజయ నాగర పతనం మళ్ళా ఆ పరిస్తుతులను   సృష్టిస్తే సంభవిస్తాయనుకొని, చారిత్రిక సిద్ధాంతాలని  ప్రతిపాదించి  వాటిని  తొలిగించడానికి  మార్గాలు వెదకడం హాస్యాస్పదమే. 


ఆలోచన , వర్తమానాన్నుంచి తప్పించుకొని పారిపోయేటందుకు ఇవ్వబడిందా ?


జరిగిపోయిన  విషయాలను స్మరించుకోవటం ,  జరగబొయ్యే  విషయాలను ఊహించుకోవటం  ---- ఇదే ఆలోచన  చేసేపని ,  వర్తమానాన్నుంచి పారిపోతుంది .  ఫలితం  ?  సగం సగం ఆలోచనలు , బుర్ర  అలసిపోవడం , శరీరం బాధపడటం .    

                                                                                                                                           NRB

Sunday, 29 March 2020

చివరకు మిగిలేదేమిటి ?

చివరకు మిగిలేదేమిటి  ? 

దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యం తెలుసుకున్నట్లే . 


 అసలు జీవితానికిఅర్థమేమై వుంటుంది ? 

మానవుడు ఈ ప్రశ్నని వేసే అవసరం రావడమే జీవితానికేదో అర్థం ఉందనుకోవడానికి  తార్కాణం . 

అర్థం లేదని  ఇతరులు రుజువు చేస్తే మనం అంగీకరించలేము .
ఆ నిరూపణ మన తార్కిక జ్ఞానాన్ని వెక్కిరించి ధ్వంసం చేస్తుంది. అది మానవుడు సహించలేడు.

జీవితానికర్థం  లేదన్న నిర్వచనానికి అసలే అర్థం లేదు .  


కానీ దాన్ని  మనంతట  మనమే రుజువు చేసుకుంటే , సృష్టి   అంత భయంకరంగా వుండకపోవచ్చు . 


సృష్టికి ఇతరులు  కలిగించిన అర్థాలని  మనం అంగీకరించలేము .
మనం కనుక్కొని , ఎముకలలో  జీర్ణించుకున్న అర్థాలని   ఇతరులకు  చెప్పలేము.

ఇతరులతో సంపర్కం వదులుకొని  ఏకాంతముగా మనం  తెలుసుకొన్న జీవిత రహస్యాన్ని  యదార్థం  అని నమ్మి  సమాధాన పరుచుకోవడం , సంఘం తో నిమిత్తం ఉన్న మనిషికి   చేతకాదు  కాబోలు .


చరిత్ర కట్టుకొన్న ప్రాచీన పునాదులు ,  సంఘం పాతుకున్న   మట్టి  విత్తనాలు , వాటిని మినహాయిస్తే  మానవుడిలో చివరకు మిగిలేదేమిటి  ?

                                                                                                                                           NRB

చివరకు మిగిలేది - ఏమిటి ?


చివరకు మిగిలేది     -  ఏమిటి  ?

అన్నదానికి   వెంటనే   దేని  చివరకు ?  అన్న ప్రశ్న  పుడుతుంది 

ఆ వెంటనే  మిగిలేది  ఎవరికి ?   అన్న జిజ్ఞాసా   రాక తప్పదు .. 

వ్యక్తికా  -  జీవితానికా -  వ్యక్తులతోను వాళ్ళ మధ్య అనేకానేక ఉత్పత్తి, పునరుత్పత్తి  సంభంధాలతోనూ  ఆవిష్కారమైన  సమాజానికా - అన్నదే అది . 

ఈ ప్రశ్న భావనామయమైంది .  

దీనికి సమాధానం భౌతిక రూపంలో వెదకడం సులువేనా  ? 


అసలీ  " మిగలటం " అన్న సమస్య గురించి విశ్వనాథ వేయిపడగలలో  చర్చించాడు      అలాగే చలం తన  " మ్యూజింగ్స్ "  లో కొంత ఆలోచన చేసాడు

ఒకానొక విశ్వాసం మిగులుతుందని విశ్వనాథ అంటే.......
మిగులుతుందనుకోవటం  భ్రమగా  తేల్చేసాడు  చలం 


వీరి తాత్విక  విశ్వాసాలకు  సృజనాత్మక రూపం కల్పించి నవలగా  రూపొందించిన  ఘనత బుచ్చిబాబుది

ఈ బ్లాగ్ లో మీరు  చదివేది , చివరకు మిగిలేది  నవలలోని కొన్ని తాత్విక విశ్వాసాలు 

                                                                                                                                         NRB

ఇదో ఫిలాసఫీ

హిందూదేశంలో  వేదాంత దృష్టికి బహిర్గత చిహ్నం  చుట్టకాదండోయ్ !                        చుట్ట వార్ధక్యానికి  చిహ్నం , వార్ధక్యం  వేదాంతాలకి  చ...